
– “కాజీపేటకు న్యాయం చేయాలి.. లేకపోతే మరో తెలంగాణ ఉద్యమం తప్పదు”
– జంతర్‌మంతర్‌లో బీఆర్ఎస్ నేతల మహాధర్నా – రైల్వే డివిజన్, కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగాలే ప్రధాన డిమాండ్
హమారా తెలంగాణ | న్యూఢిల్లీ / కాజీపేట : తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైన రైల్వే జంక్షన్లలో ఒకటైన కాజీపేటకు దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయంపై మరోసారి జాతీయ రాజధాని ఢిల్లీలో నిరసన గళం వినిపించింది. తెలంగాణ ఉద్యమానికి ముందు నుంచే ప్రారంభమైన కాజీపేట రైల్వే డివిజన్ సాధన పోరాటం, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కొనసాగుతూనే ఉందని పేర్కొంటూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు జంతర్‌మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. రైల్వే డివిజన్ ఏర్పాటు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువత, భూ నిర్వాసితులకు ఉద్యోగాలు, రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి తదితర 13 ప్రధాన డిమాండ్లతో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ కార్యక్రమం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆదేశాల మేరకు నిర్వహించామని బీఆర్ఎస్ మాజీ రాష్ట్ర కార్యదర్శి నార్లగిరి రమేష్ తెలిపారు.
“హక్కు అడుగుతున్నాం… దానం కాదు”
ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ రాష్ట్ర కార్యదర్శి నార్లగిరి రమేష్ మాట్లాడుతూ, కాజీపేట ప్రజలు మూడు దశాబ్దాలుగా రైల్వే డివిజన్ కోసం నిరంతర పోరాటం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పడితే కాజీపేటకు న్యాయం జరుగుతుందని ప్రజలు ఆశించారని, కానీ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీలను పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. కాజీపేట దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే జంక్షన్లలో ఒకటైనా, దానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. కోచ్ ఫ్యాక్టరీ కోసం భూములు ఇచ్చిన రైతులు, భూ నిర్వాసిత కుటుంబాలు, స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. కోచ్ ఫ్యాక్టరీలో కనీసం 80 శాతం ఉద్యోగాలను స్థానిక యువత, భూ నిర్వాసితులకు కేటాయించడంతో పాటు, కాంట్రాక్టు విధానంలో కాకుండా భారతీయ రైల్వే ద్వారానే శాశ్వత ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
“మరో తెలంగాణ ఉద్యమం తప్పదు”
ప్రజల న్యాయమైన హక్కులను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ, కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు, కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగాల కల్పన వంటి అంశాలను మరింత ఆలస్యం చేస్తే కాజీపేట గడ్డపై మరో తెలంగాణ ఉద్యమం తప్పదని బీఆర్ఎస్ మాజీ రాష్ట్ర కార్యదర్శి నార్లగిరి రమేష్ హెచ్చరించారు. కాజీపేట అభివృద్ధి అనేది ఒక ప్రాంతానికి సంబంధించిన అంశం మాత్రమే కాదని, తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజల డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.
ప్రభుత్వాలపై విమర్శలు :
మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గబ్బెట శ్రీనివాస్, పోలపల్లి రామ్మూర్తి, పులి రజినీకాంత్, సాదినేని సుధాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశాలపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో చొరవ చూపాలని డిమాండ్ చేశారు.
ధర్నాలో ప్రధాన డిమాండ్లు
1. కాజీపేటలో ఏర్పాటు చేయనున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీని పూర్తిగా భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలి.
2. కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువత, భూ నిర్వాసితులకు కనీసం 80–90 శాతం ఉద్యోగాలు కల్పించాలి.
3. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కాజీపేట కేంద్రంగా ప్రత్యేక రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలి.
4. కాజీపేట క్రూ లింకులను ఇతర ప్రాంతాలకు తరలించకుండా కొనసాగించాలి.
5. బోడగుట్ట వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి.
6. వరంగల్ లేదా కాజీపేటలో సెంట్రలైజ్డ్ క్రూ లాబీ ఏర్పాటు చేయాలి.
7. రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాల్లో చిరు వ్యాపారులకు వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయాలి.
8. స్థానిక ఐటీఐ విద్యార్థులకు రైల్వే అప్రెంటిస్ అవకాశాలు కల్పించాలి.
9. వరంగల్ రైల్వే స్టేడియాన్ని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయాలి.
10. రైల్వే స్టేషన్ల ఎదుట ఉన్న ఆటో అడ్డాల వద్ద ఎటువంటి రుసుములు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలి.
11. వరంగల్ ప్రజల చిరకాల కోరిక అయిన ఫాతిమా బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే శాఖ పూర్తి సహకారం అందించాలి.
12. కాజీపేట కేంద్రంగా దేశంలోని ప్రధాన నగరాలకు కొత్త రైలు సర్వీసులు ప్రారంభించాలి.
13. రాబోయే రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు తగిన ప్రాధాన్యతనిస్తూ అధిక నిధులు కేటాయించాలి.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు సంకు నర్సింగరావు, బొంగు అశోక్ యాదవ్, దండమల్ల వేణు, అర్బన్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు శిరుమల్ల దశరథం, ఎండీ అఫ్జల్, ఎండీ హుస్సేన్, సుంచు అశోక్, డివిజన్ అధ్యక్షులు దువ్వ కనకరాజు, బొల్లంపెల్లి చందర్, నర్సింగరావు, పులి విక్రమ్, కుమ్మరి రాజకుమార్, కొండ్ర శంకర్, దువ్వ నరేష్ (కిట్టు), బరిగెల వినయ్, రాబర్ట్ సెలవా, పుల్లయ్య, ఎండీ జుబేర్, ఆయాన్, మాచర్ల గణేష్, మారేపల్లి రమేష్, చిట్టిబాబు, కాటబోయిన చందు తదితరులు పాల్గొన్నారు.








